సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మకం కూడా అదే. అందుకే, భోళాశంకరుడి దర్శనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి మానససరోవర యాత్రను చేస్తుంటారు. ఈ యాత్ర చేయాలంటే, డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు ముంచి ఆధ్యాత్మిక బలం, సంకల్పం ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే మహాశివుడి కటాక్షం లేనివారికి ఈ యాత్ర చేయడం దుర్లభమే. శివ భగవానుడే కాదు, ఆయన వాహనమైన నందీశ్వరుడు, విఘ్నాలకు అధిపతి గణపతి, దేవతల సేనాధిపతి కుమారస్వామి కైలాస పర్వతంపై దర్శనమిస్తారు. సూర్యభగవనాడు భక్తితో అర్పించే కిరణాలు... కైలాస శిఖరాన్ని తాకగానే... వెండికొండ కాస్తా బంగారు మయమై.. శోభిస్తుంది. ఆ దర్శనం జన్మజన్మల సుకృతం. సముద్ర మట్టానికి 22 వేల 778 అడుగుల ఎత్తులో ఉందీ భూలోక కైలాసం. ఇక్కడికి వెళ్లిన ప్రతీఒక్కరినీ శివరూపదర్శనం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అడుగడుగునా ఆధ్యాత్మికత పరుచుకున్న ఈ అందమైన శిఖరాన్ని దర్శించుకుంటే దొరికే అనుభూతి.. దేన్ని చూసినా రాదంటారు శివభక్తులు. మౌంట్ కైలాస్‌ భూలోకంలో ఉన్న ఓ అద్భుతమనే చెప్పాలి. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో రహస్యాలు ఈ పర్వతం చుట్టూ దాగిఉన్నాయి. నాలుగువైపులా నాలుగు రంగుల్లో కనిపించడం కైలాస పర్వతానికి ఉన్న మరో ప్రత్యేకత . అందుకే.. హిమాలయాల్లోనే అత్యంత అరుదైన పర్వతంగా పేరుగాంచింది.. మహాశివుడికి నివాసం అయ్యింది కైలాసగిరి. ఎన్నో వ్రతాల ఫలాన్నిచ్చే మానససరోవరం.. పాపప్రక్షాళన చేసే కైలాస పర్వతాన్ని దర్శించుకునే మహద్భాగ్యాన్ని కల్పిస్తుంది మానససరోవర యాత్ర. కైలాసయాత్ర కైలాస్ మానసరోవర్ యాత్రను రెండు రకాలుగా చేయవచ్చు. మొదటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే.. ప్రైవేటు టూర్ ఆపరేటర్ల ద్వారా వెళ్లడం రెండో పద్దతి. ।ప్రతీ ఏడాది జూన్‌ 9 నుంచి సెప్టెంబర్ 9 మధ్య కొద్ది మందిని మాత్రమే ప్రభుత్వం ఈ యాత్రకు అనుమతిస్తుంది. ఈ ఏడాది వెయ్యా 80 మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. వీరిని 60 మంది చొప్పున 18 బృందాలుగా విభజించి యాత్రకు పంపిస్తుంది. దీనికోసం ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఆన్‌లైన్‌లో అయితే, మార్చి నాలుగో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నింపడం పూర్తైన తర్వాత ప్రింటవుట్ తీసుకుని మార్చి 11 వ తేదీ లోగా విదేశీ మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. నేరుగా దరఖాస్తు చేసుకునేవారికి కూడా మార్చి పదకొండే ఆఖరు తేది. రానుపోను 27 రోజుల పాటు సాగే మానసరోవరయాత్రకు ఎన్నో రకాలుగా సిద్దం కావాల్సి ఉంటుంది. చైనా వీసాతో పాటు, ఆరోగ్యపరీక్షలు చేసుకోవడానికి రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాల్సి ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 20వేల అడుగుల ఎత్తున పర్వతాలపై నడవాల్సి ఉంటుంది కాబట్టి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లకే అనుమతి లభిస్తుంది. గుండెజబ్బులు, రక్తపోటు, శ్వాససంబంధ సమస్యలతో బాధపడేవారు ఈ యాత్ర చేయడానికి అనర్హులు. వైద్యపరీక్షల్లో అర్హత సాధించినవారికి ఢిల్లీ నుంచి యాత్ర మొదలవుతుంది. పగలు ప్రయాణం రాత్రి పూట విశ్రాంతి పద్దతిలో ఈ యాత్ర సాగుతుంది. మూడోరోజు దార్‌చులాకు చేరుకుంటారు. 25 కిలోలకు మించి లగేజ్‌ను మోసుకు వెళ్లడానికి ఇక్కడినుంచి అనుమతి ఉండదు. గుర్రాలను, పోర్టర్లను అద్దెకు కావాలంటే.. ఇక్కడే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగోరోజు ప్రయాణం మొదలై.. నారాయణస్వామి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు టెక్కింగ్ చేసిన యాత్రికులు గుంజి అనే గ్రామానికి చేరతారు. పచ్చని ప్రకృతి అందాలు, కాళీ నది పరవళ్లు.. పర్వతాలను ముద్దాడుతున్నట్లు కనిపించే మేఘాల మధ్య ఎంతో ఆహ్లాదభరితంగా సాగుతుందీ యాత్ర. ట్రెక్కింగ్ చేయడం వల్ల వచ్చే అలసటను ఈ ప్రకృతి అందాలు మాయం చేస్తుంటాయి . మధ్యలో ఎదురయ్యే గ్రామాల్లో స్థానికులు యాత్రికులకు ఘనంగా స్వాగతం పలుకుతుంటారు. ఏడో రోజుకు యాత్ర గుంజి గ్రామానికి చేరుతుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు ఇక్కడ సమనోహరంగా కనిపిస్తాయి. సూర్యకిరణాలు పడగానే బంగారు రంగులో ప్రకాశిస్తూ.. అచ్చెరువొందిస్తాయి. రెండు రాత్రుళ్లు గుంజిలోనే గడపాల్సి ఉంటుంది. ఎనిమిదో రోజు ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ అధికారులు యాత్రికులకు మళ్లీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫిట్‌గా ఉన్నారని తేలినవారికే.. ముందడుగు వేయడానికి అనుమతి లభిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారిని వెనక్కి పంపించేస్తారు. తొమ్మిదో రోజు గంజి నుంచి ప్రయాణం నవీడాగ్‌ అనే ప్రాంతానికి సాగుతుంది. మధ్యలో వ్యాసమహర్షి గుహ కనిపిస్తుంది. ఇక్కడే ఆయన మహాభారతాన్ని రచించారట. నవీడాగ్ చేరుకున్నాక.. ఓం పర్వత దర్శనం లభిస్తుంది. అయితే.. ఎప్పుడూ మేఘాలు ముసురుకుని ఉండే ఈ పర్వతంపై ఓం ఆకారాన్ని చూడాలంటే, ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. పర్వతాల మధ్య ఓం రూపంలో కనిపించే ఆకారం.. ప్రతీఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది. నవీడాగ్ నుంచి టిబెట్ సరిహద్దు ప్రాంతమైన లిపులేక్ వరకూ మరుసటి రోజు ట్రెక్కింగ్ సాగుతుంది. మంచుపై నడుస్తూ యాత్రికులు ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. టిబెట్ సరిహద్దు దాటిన తర్వాత, తటలా కోట్‌కు బస్సులో ప్రయాణం సాగుతుంది. ఆ తర్వాతి రోజు, అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి తటలా కోట్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. పన్నెండో రోజు.. కైలాస పర్వతం బేస్ క్యాంప్ అయిన డార్చెన్‌ కు యాత్ర మొదలవుతుంది. మధ్యలో రాక్షసతాల్ అనే సరస్సు ఎదురుపడుతుంది. మానసరోవరానికన్నా ముందు కనిపించే సరస్సిది. శివ కటాక్షం కోసం రావణాసురుడు ఇక్కడే తపస్సు చేశాడని ప్రతీతి. కైలాస పర్వతం యాత్రికులకు తొలిసారి ఇక్కడి నుంచే కనిపిస్తుంది. కొండలమధ్య మహాశివలింగం కొలువైనట్లు కనిపించే.. ఆ దృశ్యం చూడగానే, యాత్రికులు అంతవరకూ పడ్డ అలసట మాయమైపోతుంది. కైలాస శిఖరం దగ్గరకు ఎప్పుడెప్పుడు చేరుకుందామా... అన్న ఆతృత పెరుగుతుంది. కాస్త ముందుకు వెళ్లగానే.. అతిమనోహరమైన మానసరోవరం దర్శనమిస్తుంది. సూర్యకాంతి పడి నక్షత్రాలు నేలకు దిగినట్లు కనిపించే దృశ్యం.. యాత్రికులను మదిని పులకరింపచేస్తుంది. డార్చెన్‌కు చేరుకున్న యాత్రికులు.. పవిత్రమైన మానసరోవరం స్నానమాచరించి.. మరుసటి రోజు కైలాస్ పరిక్రమకు సిద్ధమవుతారు. ఇలా ప్రభుత్వం ద్వారా డార్చెన్ చేరుకోవాలంటే.. పన్నెండు రోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంత సుదీర్ఘ యాత్ర చేయలేని వారి కోసం ప్రైవేటు సంస్థలు మానసరోవరయాత్రను అందిస్తున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు మీదుగా సాగే ఈ యాత్ర ద్వారా అయితే, ఐదు రోజుల్లోనే మానససరోవర్‌కు చేరుకోవచ్చు. అయితే, చిన్నపాటి విమానాల ద్వారా ఈ యాత్రంతా సాగుతుంది. వాతావరణం అనుకూలించకపోతే, యాత్రకు మధ్యలోనే అడ్డంకులు ఏర్పడవచ్చు. పరిక్రమంతో పుణ్యం కైలాస పర్వతాన్ని, మానసరోవరాన్ని వేరువేరుగా చూడలేం. హిమాలయాల్లో ఉన్న ఈ రెండు ప్రాంతాలు పరమపవిత్రమైనవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కైలాస పర్వతాన్ని చూస్తే.. అమరేశ్వరుడిని చూసిన అనుభూతే కలుగుతుంది. గడ్డకట్టే చలిలో.. మంచు పర్వతాల మధ్య.. ఎప్పుడూ స్వచ్చమైన నీళ్లతో కనిపించే మానసరోవరం.. అందరికీ మిస్టరీలానే ఉంటుంది. అందుకే, అటు కైలాస పర్వత పరిక్రమను, మానసరోవర పరిక్రమనూ పూర్తి చేసి పుణ్యం కట్టుకుంటారు భక్తులు. కైలాస పర్వత పాదభాగంలో ఉన్న డార్చెన్ నుంచి యాత్రికులు ముందుగా మానసరోవర పరిక్రమను మొదలుపెడతారు. బ్రహ్మమానస సరోవరాన్ని చుట్టూ తిరిగి రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. తొలిరోజు డార్చెన్ నుంచి కుహు కు.. రెండో రోజు కుహూ నుంచి కుగుకూ యాత్ర సాగుతుంది. కుగు నుంచి చూస్తే.. మానసరోవరం, కైలాసపర్వతం కలిసి ఉన్నట్లే కనిపిస్తాయి. ఇదో అద్భుతమైన దృశ్యం. అంతేకాదు.. ఒక్కోసారి కైలాస శికరం నుంచి కాంతిపుజం మానస సరోవరంలోకి ప్రవహిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది.. తిరిగి డార్చెన్‌కు చేరుకోవడంతో మానసరోవర పరిక్రమ ముగుస్తుంది. భూమ్మీద మరెక్కడా కనిపించని స్వచ్చమైన నీరు.. కేవలం మానసరోవరంలో మాత్రమే కనిపిస్తుంది. గంటగంటకూ ఒక్కో తరహాలో కనిపించే సరోవరం పర్యాటకులకు అంతులేని అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత రోజు డార్చెన్ నుంచి కైలాస పరిక్రమ మొదలవుతుంది. కైలాసనాథుడి కొలువైన పర్వతాన్ని చుట్టిరావడానికి మూడురోజుల సమయం పడుతుంది. మొత్తం యాత్రలో అత్యంత కష్టమైన ప్రయాణమిది. యమద్వారం మీదుగా తొలిరోజు భక్తులు నడకసాగిస్తారు. ఈ ద్వారాన్ని దాడటం ద్వారా మృత్యుభయం తొలిగిపోతుందని విశ్వసిస్తారు. ఆ తర్వాతే, బ్రహ్మపుత్ర నది దర్శనమిస్తుంది. కైలాసపర్వతంపైనే బ్రహ్మపుత్ర నది జన్మస్థలం ఉంది. దీంతో పాటు గంగ, సింధు, సట్లైజ్ నదులు కూడా ఇక్కడే పుట్టి దక్షిణాసియాను సస్యశ్యామలం చేస్తున్నాయి. అది మహాశివుడు మానవాళికిచ్చిన మహా ప్రసాదం. కష్టమైన దారిలో జాగ్రత్తగా నడుస్తూ.. కైలాసగిరి అందాలను చూస్తూ.. ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతారు శివ భక్తులు. మధ్యలో బ్రహ్మపుత్రానదిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేరాపుక్ క్యాంప్ వస్తుంది. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. కైలాస పర్వత శిఖరం.. ఇక్కడికి అత్యంత సమీపం నుంచి కనిపిస్తుంది. వాతావరణం త్వరత్వరగా మారిపోతుంటుంది. కైలాస శిఖరం కూడా దానికి తగ్గట్లే రంగులు మార్చుతూ, యాత్రికులను భక్తపారవశ్యంలో ముంచెత్తుతుంది. డేరాపుక్ నుంచి డోల్మా పర్వతం మీదుగా యాత్ర సాగుతుంది. ఈ దారి దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 20 వేల అడుగుల ఎత్తున ఉండడం కారణంగా ఆక్సిజన్ సరిగా అందదు. శివనామస్మరణ చేస్తూ, భగవంతుడిపైనే భారం వేసి ముందుకు కదులుతారు యాత్రికులు. ఆ శివనామ స్మరణే.. భక్తులకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. మధ్యలో గౌరీకుండ్ కనిపిస్తుంది. ఎమరాల్డ్‌ లా కనిపించే ఈ కొలనులోనే పార్వతీదేవి స్నానమాచరిస్తుందట. కొండల నడుమ కనువిందు చేస్తుందీ ప్రాంతం. జోంగ్‌ జెర్బును చేరుకోవడంతో ఆరోజు యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాతి రోజు.. అక్కడి నుంచి డార్చెన్‌కు ప్రయాణం సాగడంతో కైలాస పరిక్రమ ముగుస్తుంది. ఈ యాత్రలో నాలుగు వైపులా నాలుగు రకాలుగా కనిపిస్తుంది కైలాస పర్వతం. ఒక వైపు నుంచి చూస్తే స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణంలో మెరుస్తుంది. మూడో వైపు రూబీలాగా, నాలుగో వైపు నీలం రాయిగా సాక్షాత్కరిస్తుంది. ఇక నాలుగు వైపులా నాలుగు రూపాలు భక్తులకు దర్శమనిస్తాయి. హయగ్రీవ రూపమైన గుర్రం, పార్వతీ దేవి వాహనమైన సింహం, వినాయకుడికి ప్రతిరూపమైన ఏనుగు, కుమారస్వామి వాహనమైన నెమలి రూపాలు కనిపిస్తాయంటారు భక్తులు. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలే పరమపవిత్రమైన కైలాస శిఖర పరిక్రమే భక్తులు పరిమితమవుతారు తప్ప, శిఖరాన్ని అధిరోహించడానికి ఎవరూ ప్రయత్నించారు. పదో శతాబ్ధంలో ఓ బౌద్ధగురువు శిఖరాధిరోణ చేసినట్లు చెప్తారు. ఆ తర్వార ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అత్యంత ఎత్తైన ఎవరెస్టును ఎంతోమంది ఎక్కగలిగారు గానీ, కైలాస పర్వత అంచును మాత్రం ఎవరూ చూడలేకపోయారు. అందుకే, ఇది మహాఅద్భుతంగా మిగిలిపోయింది. కైలాస,మానసరోవర పరిక్రమ యాత్రను పూర్తి చేసుకున్నవాళ్లకు ఎంతో పుణ్యాన్ని, అంతులేని ఆధ్యాత్మిక అనుభూతులను మూటగట్టుకుని తిరుగు ప్రయాణవుతారు.
పితృవాక్యపరిపాలన, సత్పరివర్తన, సత్పాలన అన్నీ కలిస్తే శ్రీరాముడు. తరతరాలకూ ఆదర్శపురుషుడు. సీతారాముడిగా హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో దర్శనమిస్తున్నాడు. వందల ఏళ్లనాటి ఈ ఆలయమే.. అమ్మపల్లి కోదండరామాలయం.

ఆలయ చరిత్ర
    ఆకాశాన్నంటుతున్నట్లుండే గాలిగోపురం, విశాలమైన మండపాలు, ఆహ్లాదపరిచే ప్రకృతిఅందాలు, అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనసును ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి. ఆధ్యాత్మిక, ఆహ్లాద అనుభూతిని పంచుతున్న ఈ ఆలయం చరిత్రకు అందని కాలం నుంచే ఇక్కడ కొలువై ఉంది. పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారట. గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయం అవుతుందని కొందరు మహాత్ములు అక్కడికి వారికి ఆ సమయంలో సూచించారట. అప్పుడే ఆలయం నిర్మితమయ్యింది. ఇథమిత్థంగా ఏ కాలంలో జరిగిందన్నది చెప్పలేకున్నా, 14వ శతాబ్ధానికి చెందిన ఆలయంగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

ప్రత్యేకత

ఏకశిలపై సీతాసమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు.ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా దర్శనమిస్తాయి.

స్వామిని దర్శిస్తే..

ప్లేగు వ్యాధినుంచి విముక్తి కలిగించిన అమ్మపల్లి శ్రీరాముడు ఆరోగ్యరాముడిగా ప్రసిద్ధికెక్కాడు. అనారోగ్య పీడితులైనవారు, ఇక్కడి కోదండ రామస్వామిని దర్శిస్తే, త్వరితగతిన వ్యాధి నయమవుతుందన్న విశ్వాసం భక్తులది. విద్యాబుద్ధులు ప్రసాదించే దేవుడిగా, ఆర్థిక సమస్యలను తీర్చే దైవంగా, సంతనా,అనారోగ్యసమస్యలున్నవారికి ఆపద్భాందవుడిగా వినుతికెక్కాడు అమ్మపల్లి శ్రీరాముడు.

పూజాదికాలు
ఉదయం ఆరు గంటల నుంచే అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయంలో పుజాధికాలు ఆరంభం అవుతాయి. శనివారం ఈ ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతీయేటా శ్రీరామనవమికి అంగరంగ వైభవమైన ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఆలయ విశిష్టత
అత్యంత విశాలమైన పరిసరాల్లో నెలవై దర్శించినంతనే మనసుకు ఆహ్లాదానుభూతిని ప్రసాదించే చూడచక్కని ఆలయం అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయం. గగనాన్ని తాకుతుందా అనిపించే ఎత్తైన రాజగోపురం, దాన్ని దాటుకుని వెళ్లగానే కనిపించే విశాలమైన మంటపాలు, చుట్టూ కోనేర్లు భక్తులకు దర్సనమిస్తాయి. పూర్వ కాలంలో వివిధ వృత్తుల వారు ఈ కోనేర్ల ఒడ్డునే తమ కుల వృత్తులు నిర్వహించేవరాట.

    అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయ రాజగోపుర నిర్మాణం ఆధారంగానే కుతుబ్ షాహీ సుల్తానులు చారిత్రక చార్మినార్ ను నిర్మించారట. శతాబ్ధాల క్రితం వేంగి రాజులు ప్రతిష్టించినట్లుగా భావించే అనేక శిల్పాలు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి.

ఎలా వెళ్లాలి?
అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మపల్లి. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ముప్పై కిలోమీటర్లు. చార్మినార్, కోఠి, సికింద్రాబాద్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, దిల్ సుఖ్ నగర్ ల నుంచి శంషాబాద్ కు విస్తృతమైన బస్సు సౌకర్యాలు ఉన్నాయి. శంషాబాద్ నుంచి అమ్మపల్లికి నిరంతరం ఆటోలు తిరుగుతూ ఉంటాయి.


కోనసీమ అందాలు, పావన గోదావరీ గలగలలతో అలరారుతూ ప్రాకృతిక సౌందర్యం కొలువైన జిల్లా తూర్పుగోదావరి జిల్లా. కోస్తాంధ్రకు కీలకస్థానమైన ఈ జిల్లాకు ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చిన దేవస్థానం అంతర్వేది లక్ష్మీనరసింహాలయం.

నరసింహుని రూపం ఉగ్రరూపం. మృగరాజైన సింహం తలతో ప్రళయభీకరంగా కనిపించినా, భక్తుల పాలిట మాత్రం మనసున్న దేవుడే. భక్త సులభుడని పేరున్న శ్రీ మహావిష్ణువు దశావతార స్వరూపమే నరసింహావతారం. దేవదేవుడైన మహావిష్ణవు లోకకళ్యాణం కోసం దశవతారాలను దాల్చగా, అందులో నాలుగో అవతారం నారసింహావతారం.

ఆలయ విశిష్టత
బంగాళాఖాతం తీరాన కొలువైన క్షేత్రం అంతర్వేది. ప్రశాంత పరిసరాల్లో కొలువైన ఈ ఆలయాన్ని దర్శిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా మారుతుందట. ఎన్ని సమస్యలతో ఈ క్షేత్రంలో అడుగుపెట్టినా, అన్నీ దూరమైన అనుభూతి ప్రసాదిస్తాడని అంతర్వేది నరసింహస్వామికి పేరు.

కోరమీసాలవాడు అంతర్వేది నారసింహుడు. కోరమీసాలు.. వీరత్వానికి ప్రతీక. అలాంటి ఈ స్వామిని మొక్కుకుంటే అనంత ధైర్యసాహసాలను ప్రసాదిస్తాడట. మానసిక ఆందోళనలతో బాధపడేవారు ఈయన మీద భారం వేసి కేవలం టెంకాయ సమర్పించినా, ధృడమైన మనసును ఇస్తాడని భక్తుల నమ్మకం. ఏదైనా ఇబ్బందితో బాధపడుతున్నవారు ఈ సన్నిధిలో 5 ప్రదిక్షణలు చేసి టెంకాయ సమర్పిస్తే చాలంటారు. అంతటి మహిమాన్విగా ఈ స్వామి మహిమలను చాటుతున్నాడు.

పూజాదికాలు

ఈ పుణ్యప్రదేశంలో సుప్రభాతం, నివేదన, అష్టోత్తర పూజలు, నరసింహ దండకాలు, హారతులతో ఈ క్షేత్రం మారుమోగుతూ ఉంటుంది. అంతర్వేది క్షేత్రంలో నిత్యం అభిషేకాలు, హోమాలు, యాగాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కలశపూజలను సైతం విశేషంగా నిర్వహిస్తారు. అంతర్వేది క్షేత్రంలో ఉత్సవమూర్తుల వద్ద అర్చన చేయించుకుంటే చాలా శుభప్రదం అని అంటారు. దంపతులు ఇలా పూజార్చన నిర్వహిస్తే, సంసార జీవితంలో కలతలు ఉండవని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.

అంతర్వేది నరసింహస్వామి ఉత్సవాల్లో ఫిబ్రవరి మాసంలో ఇక్కడ నిర్వహించే స్వామి కళ్యాణోత్సవాలు, రథోత్సవాలు ప్రధానమైనవి. ఈ వేడుకలనే అంతర్వేది తిరునాళ్లని అంటారు. రథారూఢుడైన స్వామి భిన్న విభిన్న రూపాలు దాల్చి ఆలయ పురవీధుల్లో ఊరేగుతారు.

చారిత్రక సంపద

ఈ ఆలయాన్ని 15 నుంచి 16 వ శతాబ్ధం మధ్యలో నిర్మితమైనట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనేకమంది రాజులు, చక్రవర్తులు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు. కనువిందైన ఆలయ స్తంభాలు, అబ్బురపరిచే విగ్రహాలు, విశాల మండపాలు, ప్రాకారాలు, గోపురాలతో భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి అచ్చమైన ప్రతిరూపంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది.

స్థల పురాణం

కృతయుగంలో వశిష్ట మహాముని గోదావరిలోని ఓ పాయను తెచ్చి సాగరసంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు. అయితే విశ్వామిత్రుని ప్రోద్భలంతో రక్తవిలోచనుడు అనే రాక్షసుడు వశిష్టుని తపస్సుకు భంగం కల్గించడమే కాకుండా, అతని కుమారులను హతమారుస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్టుడు నరసింహస్వామిని ప్రార్ధించగా, ఆయన ప్రత్యక్షమై రక్తవిలోచనుడితో యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడిని భూమిపై పడే ప్రతీ రక్తపు బొట్టూ, ఓ రాక్షసుడిగా మారుతుంటుంది. అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబికా అనే మాయాశక్తిని రప్పించి, రాక్షసుడి రక్తం నేలపై పడకుండా నాలుక చాచాలని సూచిస్తాడు. స్వామి ఆదేశం మేరకు ఆమె నాలుక చాచగా, రాక్షసుడిని నరసింహుడు సంహరిస్తాడు. ఆపై , వశిష్టుని కోరిక మేరకు నరసింహాస్వామికి ఇక్కడ కొలువైనట్లు ప్రతీతి.

ఎలా వెళ్లాలి?

అంతర్వేది క్షేత్రం ఉభయగోదావరి జిల్లాల మధ్యలో ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నుంచి, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం నుంచి విస్తృతమైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నర్సాపురానికి హైదరాబాద్ నుంచి రైళ్లో కూడా వెళ్లవచ్చు.
శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్. జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనిమస్తుంటారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన, ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణాకఠాక్షాలను చూపుతున్నారు.
స్థల పురాణం
అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.
విశిష్టరూపం
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
విశిష్ట నిర్మాణం
అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం, భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.
ప్రత్యేక పూజలు
శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికం సంరంభం కనిపిస్తుంది. రోజూవారీ పూజలతో పాటు, ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖయ్లో భక్తులు వస్తుంటారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అపాద్భాంధవ పాత్ర పోషిస్తుంది.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.
జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణాలోచన ఆలంపురీ స్థిత మాతా సర్వత్రా ఫల సిద్ధిదా..!
పావన కృష్ణవేణీ నదీ తీరపు పరవళ్లు, మదిని మైమరిపించే పరిసరాల మధ్య నెలవైన ఆధ్యాత్మిక ప్రదేశం అమరావతి. పరమేశ్వరుడు అమరలింగేశ్వరుడిగా కొలువై ఇక్కడ భక్తజనాన్ని దీవిస్తున్నాడు. ఇక్కడి స్వామిని అమరేశ్వరుడు, క్రౌంచనాథుడు అని కూడా అంటారు. రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో మొదటిది ఈ అమరావతి పుణ్యస్థలం.

పంచారామ క్షేత్రాల్లోనే పరమపవిత్రమైనది అమరావతి. దాదాపు పదిహేను అడుగుల ఎత్తైన లింగరూపంలో కొలువై ఉండడం అమరలింగేశ్వరుని విశిష్టత. సుప్రసిద్ధ శైవప్రదేశంగా విరాజిల్లుతున్న అమరావతి క్షేత్రానికి విశిష్టమైన స్థల పురాణం ఉంది.

క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో ఆత్మలింగం ఉద్భవించింది. ఈ ఆత్మలింగాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో ధరించి శివు కోసం ఘోర తప్పస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి మరణం లేకుండా వరం ఇస్తాడు. అయితే, దేవతలపై యుద్ధం చేసే పక్షంలో తనపై గాని, తన సంతతిపై గాని దాడి చేస్తే ఖండఖండాలవుతాని శివుడు ఓ షరతు పెడతాడు. కాలక్రమంలో శివుని కుమారుడు కుమారస్వామితో, తారకాసురుడు తలపడగా, అతని తల ముక్కలుగానూ, అతని మెడలోని ఆత్మలింగం అయిదు ముక్కలుగానూ పగిలిపోతుంది. ఈ ఆత్మలింగ శకలాల్లో ఒకటి ఇంద్రునిచే అమరావతిలో ప్రతిష్టమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలోని శివలింగం అదేనని భక్తుల విశ్వాసం. సుమారు పదిహేను అడుగుల ఎత్తున ఇక్కడ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది.

సకల శుభకరం

పవిత్ర దివ్యదైవమైన అమరేశ్వరుని దర్శనం సకల శుభకరం అని ప్రతీతి. ఇక్కడ మరణిస్తే, వారి ఆత్మ శివునిలో కలిసిపోతుందని చెబుతారు. అంతటి మహిమాకరుడట ఇక్కడి శివుడు. 15 అడుగుల ఎత్తైన రూపంలో కనిపించే అమరేశ్వరుడిని దర్శించిన భక్తుల జీవితాలను సైతం ఉన్నతస్థితి చేర్చుతాడట. ఆయన రూపం ద్వారానే ఈ విషయాన్ని చాటుతుంటాడని చెబుతారు.

మహిమాకరుడైన ఇక్కడి అమరలింగేశ్వరుడిని ప్రతినిత్యం విశేష సంఖ్యలో భక్తులు దర్సించుకుంటారు. అమరము అంటే అంతం లేనిది అని అర్థం. తనను మొక్కిన భక్తులకు అసలు అంతం లేని శుభాలను అందించి, వారి జీవితాలను శుభ్రదం చేస్తాడు కనుకనే, ఈయనకు అమరేశ్వరుడు అని పేరు వచ్చిందంటారు.

అలంకార ప్రియుడు

శివుడు ఆది దేవుడు. అంతటి శక్తిమంత దైవానికి అమరావతి క్షేత్రంలో నిత్యం అంగరంగ వైభవంగా పూజాపునస్కారాలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామిని సుందరంగా అలంకరించి పూజాధికాలు నిర్వహిస్తారు. అభిషేక ప్రియుడని పేరున్న శివుడు అమరావతిలో మాత్రం అలంకార ప్ర్రియుడిగా దర్శనమిస్తాడు. ఆలయం కూడా సువిశాల స్థలంలో నిర్మితమయ్యింది. బౌద్ధ, ద్రవిడ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఐదు పంచారామ వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

చేరుకోవడం ఎలా?
అమరావతి క్షేత్రం గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు నుంచి నిరంతరం బస్సు సర్వీసులు ఉంటాయి. విజయవాడ నుంచి కూడా తరచూ బస్సులు వెళుతుంటాయి. వాహనాల్లో వెళ్లేవారు విజయవాడ నుంచి కృష్ణానది కరకట్ట ద్వారా వెళ్లవచ్చు.

వసతి.. ఇతర దర్శనీయ స్థలాలు..
అమరావతిలో ఏపీ టూరిజం వారి హరిత గెస్ట్ హౌస్ ఉంది. ముందుగానే గదులు బుకింగ్ చేసుకోవచ్చు. ఇతర లాడ్జిలు కూడా అందుబాటులో ఉంటాయి.
అమరావతిలోనే కాలచక్రం నిర్వహించారు. ఇక్కడ అతిపెద్ద బుద్ధ విగ్రహం అందరికీ ఆహ్వానం పలుకుతుంది. పురావస్తు శాఖవారి మ్యూజియం కూడా ఉంది.